ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి మరణ ధృవీకరణ పత్రం జారీ చేయడం సహజం. ఆ పత్రంలో ఎప్పుడు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అనే అంశాలతో పాటు తల్లిదండ్రుల పేర్లను నమోదు చేస్తారు. కానీ ఓ గ్రామ అధిపతి మాత్రం.. ఉజ్వల భవిష్యత్(బ్రైట్ ఫ్యూచర్) ఉండాలని కాంక్షిస్తూ డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని సిర్‌వారియా గ్రామంలో ఫిబ్రవరి 17న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ఇప్పుడు ఈ ధృవీకరణ పత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
లక్ష్మి శంకర్ అనే వృద్ధుడు అనారోగ్య కారణాలతో జనవరి 22న మృతి చెందాడు. అయితే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకునేందుకు కుమారుడికి తన తండ్రి డెత్ సర్టిఫికెట్ అవసరమొచ్చింది. దీంతో గ్రామ అధిపతికి దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామ అధిపతి మరణ ధృవీకరణ పత్రం జారీ చేస్తూ లక్ష్మి శంకర్ మృతి వివరాలను నమోదు చేశారు. ఉజ్వల భవిష్యత్ ఉండాలని కాంక్షిస్తున్నట్లు చివరగా ఆ పత్రంలో పేర్కొన్నాడు గ్రామ అధిపతి. దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. అయితే బర్త్ సర్టిఫికెట్ జారీ చేసే సమయంలో.. ఆ బిడ్డకు మంచి భవిష్యత్ ఉండాలని కాంక్షించడం గ్రామ అధిపతికి అలవాటు. ఆ అలవాటులోనే ఈ పొరపాటు జరిగి ఉండొచ్చని స్థానికులు పేర్కొన్నారు.